*అభివృద్ధికి కోటాను కోట్లు ఇస్తే.. పరువు తీశారు* *మొగిలిగిద్దలో చేతులారా “చెయ్యి” కాల్చుకున్నారా..?* *సీఎం వచ్చినా.. ప్రగతి వెలుగులు తెచ్చినా..?* *కాంగ్రెస్ ను జోకొట్టి.. బిఆర్ఎస్ కు జైకొట్టిన జనం..* *అభ్యర్థి ఎంపిక లోపమే కారణమా..?* *నియోజకవర్గంలో అతిపెద్ద గ్రామాన్ని కోల్పోయిన కాంగ్రెస్..* *ఎమ్మెల్యే స్వయంగా వెళ్లి ప్రచారం చేసినా కనిపించని ఫలితం..* *ఎందుకిలా జరిగింది..? కారణాలు ఎన్నో..!* *మొగిలిగిద్దలో చేదు అనుభవంపై హలో షాద్ నగర్ రిపోర్ట్* *రూ. 63కోట్లతో కాంగ్రెస్ అభివృద్ధి పనులు చేపట్టినా జనంలో మార్పు ఎందుకు..?* *మొగిలిగిద్ద అభివృద్ధిపై నీలి నీడలు* స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రామానికి వచ్చారు.. గ్రామస్తులు ఎప్పటినుంచో అడుగుతున్నవన్నీ ఇచ్చారు.. ఎమ్మెల్యే వెళ్లారు.. ఇంటింటి ప్రచారం చేశారు.. అయినా అక్కడ వారికి చేదు అనుభవమే ఎదురయింది.. నియోజక వర్గంలోని అతిపెద్ద గ్రామం, చరిత్ర కలిగిన పల్లె.. వారి “చెయ్యి” దాటిపోయింది. ఫరూక్ నగర్ మండలం మొగిలిగిద్ద గ్రామంలో కాంగ్రెస్ పరిస్థితి. సర్పంచ్ అభ్యర్థి ఎంపిక విషయంలో జరిగిన పొరపాటు ద్వారా చేతులారా చెయ్యి కాల్చుకున్నారు అనే విమర్శలు కూడా ఇప్పుడు వినిపిస్తున్నాయి. నియోజకవర్గం లోని చారిత్రాత్మక గ్రామంగా పేరుగాంచిన గ్రామంలో ఒక్కసారి సర్పంచ్ ఎన్నికల సందర్భంగా తాజా రాజకీయ పరిణామాల గురించి చెప్పుకుంటే.. *చేతిలో చెయ్యేసి..* ఫరూక్ నగర్ మండలం మొగలిగిద్ద గ్రామానికి చాలా పెద్ద చరిత్ర ఉంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో మొట్టమొదటి ప్రభుత్వ పాఠశాల ఇక్కడే ఏర్పాటయింది. నియోజకవర్గంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉన్న ఒకే ఒక గ్రామం మొగిలిగిద్ద. గతంలో ఇక్కడ పోలీస్ స్టేషన్ కూడా ఉండేది. ఐదువేలకు పైగా జనాభా ఉన్న అతిపెద్ద గ్రామం మొగిలిగిద్ద. ఏ ఎన్నికల్లో నైనా ఈ గ్రామాన్ని నాయకులు కీలకంగా భావిస్తారు. ఆ దృష్టితోనే గతంలో ప్రొఫెసర్ హరగోపాల్ పిలుపుమేరకు, ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కృషితో ఈ గ్రామాన్ని స్వయంగా సందర్శించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రామానికి వరాల పంట పండించారు. ఈ గ్రామాభివృద్ధి కోసం ఏకంగా 63 కోట్లు మంజూరు చేశారు. ఇందులో భాగంగా 150 ఏళ్ల చరిత్ర కలిగిన ఇక్కడికి ప్రభుత్వ పాఠశాల భవన నిర్మాణం, రూ. ఐదు కోట్లతో సిసి రోడ్లు, రూ. 10 కోట్లతో పాఠశాల భవనం, రూ. 25 లక్షలతో హెల్త్ కేర్ సెంటర్, రూ. 50 లక్షలతో మైనారిటీ షాదీఖానా, రూ. 50 లక్షలతో జూనియర్ కళాశాల భవన నిర్మాణం, అదేవిధంగా తెలంగాణకే తలమానికంగా రూ. 45 లక్షలతో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ఏర్పాటు కోసం సీఎం నిధులు వెచ్చించారు. ఆయన స్వయంగా గ్రామాన్ని సందర్శించారు. గ్రామాభివృద్ధికి పూర్తిస్థాయిలో సహకరిస్తారని పెద్ద సభ పెట్టి మరి హామీ ఇచ్చారు. అయితే ఇంత ఖర్చు చేసిన, ఇంత హడావిడి చేసిన సాక్షాత్తు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ గ్రామానికి వచ్చి ఇంటింటి ప్రచారం చేసినప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ విజయం సాధించలేకపోయింది. మొగలిగిద్ద గ్రామాన్ని అంజయ్య యాదవ్ దత్తత తీసుకున్నాడని దత్తపుత్రుడు ఏమి చేయలేదని అనేక విమర్శలు కూడా గుప్పించారు అయినా ప్రజలు విశ్వసించలేదు. ఇక్కడ కాంగ్రెస్ ఓటమికి కారణాలను ఒక్కసారి అన్వేషించినట్లయితే.. *ఎందుకు “చెయ్యిచ్చారు”..?* 3500 పైచిలుకు ఓట్లు కలిగిన మొగిలిగిద్ద గ్రామాన్ని అటు కాంగ్రెస్, ఇటు బిఆర్ఎస్ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. చరిత్ర కలిగిన అతిపెద్ద ఈ గ్రామాన్ని తమ ఖాతాలో వేసుకునేందుకు కృషి చేశాయి. అయితే అధికార పార్టీకి ఎక్కువ అవకాశాలు ఉన్నా ఇక్కడ మాత్రం బీఆర్ఎస్ 800 పైచిలుకు భారీ మెజారిటీతో పై చేయి సాధించింది. దీనికి కారణాలు అన్వేషించినట్లయితే మైనారిటీలు ఎక్కువగా ఉన్న ఈ గ్రామంలో షాదిఖానా నిర్మాణం విషయంలో జాప్యం జరగడం ఆ వర్గాన్ని దూరం చేసింది. అదేవిధంగా ఓ మైనార్టీ యువ నాయకుడిపై కరపత్రాలు ముద్రించి పోలింగ్ ముందు రోజు కాంగ్రెస్ మద్దతుదారుడు అంబటి రాజుకు సంబంధించిన వారు దుష్ప్రచారం చేయడం కూడా మైనార్టీ వర్గాల్లో కాంగ్రెస్ కు ఓట్లు పడకుండా చేసింది. ఇక ముఖ్యంగా అంబటి రాజు తీరుపై కూడా ఓటర్లలో సంతృప్తి లేదు. ఎమ్మెల్యేతో ఏమైనా పని ఉంటే ఆయన అంబటి రాజుతో కలిసి రమ్మని చెప్పడం, అంబటి రాజు దగ్గరికి వెళితే ఆయన దగ్గరికి రానీయకపోవడంతో ప్రజల్లో ఒక రకమైన ఆగ్రహం ఉంది. అతనితో పాటు పోటీలో ఉన్న తౌడు వెంకటేశం ఒకవేళ రంగంలో ఉండి ఉంటే ఫలితం వేరేగా ఉండి ఉండేదని గ్రామస్తులు అభిప్రాయపడుతున్నారు. ఎమ్మెల్యే స్వయంగా వెళ్లి ప్రచారం చేసిన, దత్తపుత్రుడు అని చెప్పి మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ గ్రామానికి ఎలాంటి సేవలు చేయలేదని విమర్శలు చేసిన, ముఖ్యమంత్రి ద్వారా తాము తెచ్చిన 63 కోట్ల నిధుల గురించి చెప్పిన జనంలో స్పందన కనిపించలేదు. అంబటి రాజును పార్టీ నాయకులు విశ్వసించలేదు. అభ్యర్థి ఎంపిక మొదలుకొని, మంజూరైన పనులను వేగంగా పూర్తి చేసేదాకా కాంగ్రెస్ పార్టీ చేసిన నిర్లక్ష్యం ఈ పరాజయానికి కారణమని స్పష్టమవుతుంది. ఇక్కడ ప్రజల మనసుల్లో ఏముందో తెలుసుకోకుండా ముందుకు వెళ్లిన కాంగ్రెస్ పార్టీ భారీ మూల్యమే చెల్లించింది.అభివృద్ధికి కోటాను కోట్లు ఇస్తే.. మొగలిగిద్ద ప్రజలు కాంగ్రెస్పరువు తీశారు. దీంతో గ్రామంలో చేపట్టి పోయే అభివృద్ధి పనులపై కూడా నీలి నీడలు అలుముకున్నాయి.అసెంబ్లీ పరిధిలోని అతిపెద్ద గ్రామాన్ని దూరం చేసుకుంది. భవిష్యత్తులో కూడా ఆచితూచి అభ్యర్థులను ఎంపిక చేయాల్సిన అవసరం ఉంది. త్వరలోనే జరిగే ప్రాదేశిక ఎన్నికల్లో కూడా ఇలాంటి తప్పు నిర్ణయాలు తీసుకుంటే మరోసారి చేతులు కాల్చుకునే అవకాశం ఉంటుంది..