సాగునీటి అన్యాయం, చేనేత సంక్షోభం, పర్యాటక అవకాశాలపై సీనియర్ సిటిజన్ ఫోరమ్ డిమాండ్లు
గద్వాల ప్రాంత అభివృద్ధి, సాగునీటి సమస్యలు, చేనేత రంగ సంక్షోభం, ఉపాధి అవకాశాల కొరత వంటి కీలక అంశాలపై సీనియర్ సిటిజన్ ఫోరమ్ జిల్లా అధ్యక్షులు మోహన్ రావు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ మాన్యశ్రీ జిష్ణుదేవ్ వర్మను కలిసి విస్తృతమైన వినతిపత్రం సమర్పించారు. చరిత్రలో గద్వాల ఎదుర్కొన్న అన్యాయాలను వివరించడంతో పాటు, భవిష్యత్తు అభివృద్ధికి స్పష్టమైన రోడ్ మ్యాప్‌ను ఈ వినతిపత్రంలో ప్రతిపాదించారు.
రాష్ట్ర పునర్విభజనతో కోల్పోయిన అవకాశాలు
1956లో భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు సమయంలో గద్వాల ప్రాంతం భౌగోళిక, రాజకీయ మార్పులకు లోనై తీవ్రంగా నష్టపోయిందని వినతిపత్రంలో పేర్కొన్నారు. నాటి నుంచి నేటి వరకు ఈ ప్రాంతాన్ని వెంటాడుతున్న ప్రధాన సమస్య సాగునీటి వాటానేనని స్పష్టం చేశారు.
రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ – తీరని జలవేదన
గద్వాల రైతులకు ప్రాణాధారమైన రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ (RDS) నేటికీ పూర్తి ప్రయోజనం అందించలేకపోతోందని ఫోరమ్ ఆవేదన వ్యక్తం చేసింది.
బచావత్ ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం తుంగభద్ర నది నీటిలో గద్వాలకు స్పష్టమైన హక్కు ఉన్నప్పటికీ, అనకట్ట కర్ణాటక పరిధిలో ఉండటంతో ఎగువ ప్రాంతాల్లో అక్రమ వినియోగం జరుగుతోందని తెలిపారు.
87,500 ఎకరాలకు నీరు అందాల్సి ఉండగా, చివరి భూములకు చుక్క నీరు కూడా చేరకపోవడం రైతులను కుంగదీస్తోందన్నారు.
‘ధాన్యాగారం’గా మారే అవకాశాన్ని కోల్పోయిన గద్వాల
అంతర్రాష్ట్ర ఒప్పందాలు సమర్థవంతంగా అమలై ఉంటే లేదా గద్వాల భౌగోళికంగా భిన్న పరిధిలో ఉండి ఉంటే, ఈ ప్రాంతం నేడు దక్షిణ తెలంగాణకు ధాన్యాగారంగా ఎదిగేదని వినతిపత్రంలో పేర్కొన్నారు.
చేనేత గద్వాల… గుర్తింపు లేని కళ
గద్వాల అంటేనే చేనేత చీరలని దేశవ్యాప్తంగా పేరు ఉన్నా, నేతగాళ్లకు గిట్టుబాటు ధరలు, మార్కెటింగ్ సదుపాయాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఫోరమ్ గవర్నర్ దృష్టికి తీసుకెళ్లింది.
అంతర్జాతీయ స్థాయిలో గద్వాల చేనేతకు బ్రాండింగ్ కల్పించి, నేతకారులకు భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది.
అలంపూర్ – యునెస్కో గుర్తింపుతో అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా మారాలి
దక్షిణ కాశీగా పేరొందిన అలంపూర్ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర ఆలయానికి UNESCO గుర్తింపు సాధించాలనే డిమాండ్‌ను వినతిపత్రంలో ప్రధానంగా ఉంచారు.
ఇలా జరిగితే గద్వాల జిల్లా అంతర్జాతీయ పర్యాటక పటంలో నిలిచి, స్థానిక ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తుందని వివరించారు.
వ్యవసాయం, ఉపాధికి కొత్త దిశ
సాగునీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందించేందుకు గద్వాల జిల్లాలో కృషి విజ్ఞాన కేంద్రం (KVK) ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
అదేవిధంగా నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి శిక్షణ ఇచ్చి, గద్వాలను ఒక పారిశ్రామిక హబ్‌గా తీర్చిదిద్దాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
పదేళ్ల తెలంగాణ… గద్వాలకు ఏమిచ్చింది?
తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే గద్వాల అభివృద్ధి చెందుతుందని ప్రజలు ఆశించినా, గత పదేళ్లలో అభివృద్ధి కాగితాలకే పరిమితమైందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
నీతి ఆయోగ్ నివేదికల్లో వెనుకబడిన జిల్లాల జాబితాలో గద్వాల కొనసాగుతుండటం ఆందోళన కలిగించే విషయమని సీనియర్ సిటిజన్ ఫోరమ్ పేర్కొంది.
గవర్నర్ గారు కేవలం వినతులు స్వీకరించడానికే పరిమితం కాకుండా, కేంద్రం–రాష్ట్రం మధ్య వారధిగా వ్యవహరించాలని ఫోరమ్ కోరింది.
నీతి ఆయోగ్ నిధుల మళ్లింపు, తుంగభద్ర నీటి వాటాపై కేంద్ర జలశక్తి శాఖతో సమన్వయం సాధిస్తేనే గద్వాలకు నిజమైన న్యాయం జరుగుతుందని స్పష్టం చేసింది.
వినతులు కాదు… ఆత్మగౌరవ నినాదాలు
సీనియర్ సిటిజన్ ఫోరమ్ లేవనెత్తిన అంశాలు సాధారణ విజ్ఞప్తులు కావని, గద్వాల ప్రజల ఆత్మగౌరవానికి సంబంధించిన నినాదాలని నాయకులు పేర్కొన్నారు.
ప్రభుత్వాలు స్పందిస్తేనే గద్వాల మళ్లీ తన పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో ఎంపీ మల్లు రవి ,అచ్చన్నగౌడ్,రామన్ గౌడ్, బాలకిషన్ రావు, అక్బర్ బాషా తదితరులు ఉన్నారు